ప్రజల కోసమే పోలీస్‌ ఆంక్షలు

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠినమైన ఆంక్షలు అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా విజయవంతం చేసిన ప్రజలు ఈ నెల 31 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. లాక్‌డౌన్‌ అమలుకు స్వచ్ఛందంగా ప్రజలు సహకరించే పరిస్థితి లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు రోడ్లపైకి వచ్చి తగు చర్యలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాలతోపాటు అనేక పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లోనూ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు.  ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. 




 



జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు
కరోనా పాజిటివ్‌ కేసులు ఏమైనా ఉన్నాయా? అనే విషయమై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. గ్రామ, వార్డు వలంటీర్ల సాయంతో ఆయా ప్రాంతాల్లో వైద్య, రెవెన్యూ సిబ్బంది, తదితరులతో కూడిన టీమ్‌కు పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పించారు. విదేశాల నుంచి ఇటీవల ఎవరైనా వచ్చారా? అనే విషయాన్ని ఆరా తీసేందుకు పోలీసులు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.  బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని ‘ఆంధ్రప్రదేశ్‌ అంటు వ్యాధి కొవిడ్‌–19 రెగ్యులేషన్‌ 2020’గా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటు వ్యాధుల చట్టం –1897లోని సెక్షన్‌ 2,3,4 ప్రకారం కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. తద్వారా గాలి, మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. దీన్నే లాక్‌డౌన్‌గా వ్యవహరిస్తున్నారు. 


లాక్‌డౌన్‌ కఠినంగా అమలు
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితి, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైరస్‌ తీవ్రత ప్రజలకు అర్థమయ్యేలా తొలుత సహనంతోనే సమాధానం చెప్పాలని, స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించకపోతే కఠినంగానే వ్యవహరించాలన్నారు. దుకాణదారులు, వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.